Monday, July 13, 2009

ఎదురుచూపు


ప్రతిరోజూ మా ఇంటెదురుగా ఉండే పోస్టాఫీసు అరుగు పైన ఒకావిడ కనిపిస్తుంది. వచ్చే పోయే పోస్టుమాన్లని ఏదో అడుగుతూ ఉంటుంది, కొంత మంది ఏదో చెప్తారు, కొంతమంది ఆమెని విననట్టుగా వెళ్ళిపొతుంటారు, మరింకొందరు విదిలింపుగా చిరాకు ప్రదర్శిస్తుంటారు.

నేనిక్కడికొచ్చి వారం రోజులయ్యింది అప్పట్నుండి చూస్తున్నాను ఇదే తంతు, చదువైపోయి ఉద్యోగాల వేటలో సొంతూరు భద్రాచలం నుండి హైదరాబాదులోని కూకట్ పల్లిలో ఉంటున్న మా ఫ్రెండు రమేషుగాడి రూములో చేరాను, రోజుకో పది అప్లికేషన్లు పోస్టు చేస్తూ, ఇంటెర్వ్యూల కోసం ఎదురుచూస్తున్నాను. ఇలా ఓ రోజు కొన్ని అప్లికేషన్లనూ, ఇంటికి వ్రాసిన ఉత్తరాన్నీ పోస్టు చెయ్యటానికి పోస్టాఫీసుకెదురుగా ఉన్న పోస్టుడబ్బా దగ్గరికి వెళ్ళాను. అప్పుడే ఆమెని దగ్గరగా చూడటం, బహుసా ఓ యాభయ్యేళ్ళుంటాయి, పసుప్పచ్చ రంగు నేత చీర, గుండ్రటి ముఖము, గుంటలు పడిన కళ్ళు, ఇవి ముందుగా నాకు కనిపించినవి. దగ్గరకి వెళ్ళి పలకరిద్దామనుకుని, ఎందుకో జంకి ఊరుకున్నాను.ఇలా ఓ నాలుగు రోజులు, వెళ్ళాలా వద్దా? వెళ్ళినా ఏమని పలకరించాలి? “ఏమండి నేను ఈ ఎదురుగా ఉండే రూములోనే ఉంటాను మిమ్మల్ని రోజూ చూస్తూ ఉంటాను” అనా, ఏమనుకుంటరో ఏమో…అయినా సరే ఎందుకో ఆవిడతో మాట్లాడాలి అని ఓ కోరిక, ధైర్యం చేసి ఆవిడ దాక వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతుంటే ఆవిడ నన్ను చూసి అడిగింది….

“బాబూ నువ్వు పోస్టుమానువా?”,

“కాదండి ఎందుకడుగుతున్నారు?”సమాధానం కోసం ఎదురుచూడసాగాను, దానికి ఆవిడ నీళ్ళు నిండుతున్న కళ్ళతో చూస్తూ

“ఏమీ లేదు బాబూ, నేను పోస్టుమానుతో మాట్లాడాలి” అని ఊరుకుంది. నాలో ఏదొ తెలియని అలజడి, ఆవిడెందుకేడుస్తోంది?,

“అమ్మా నేను పోస్టుమానుని కాకపోవచ్చు కానీ మీకేమైనా సాయం చెయ్యమంటారా?” అడగకుండా ఉండలేకపోయాను.

మళ్ళీ ఏదోలా చూసి “ఏమీ లేదులే నాయనా పని మీద వెళుతున్నట్టున్నావు వెళ్ళు” అని అంది. ఇంకేమి మాట్లాడలేకపోయాను. అక్కడ్నుండి వెళ్ళిపోయాను.

రెండో రోజు మధ్యాహ్నం బయట మెస్సులో భోజనం చేసి వస్తుంటె పోస్టాఫీసు ఎదురుగా ఆవిడ తూలుతూ కనిపించింది, నేను వెంటనే వెళ్ళి

“ఏమైందమ్మా ఏమిటలా ఉన్నారు?” అని అడిగాను ఆత్రంగా.

“దాహంగా ఉంది బాబూ కొన్ని మంచినీళ్ళు తెచ్చిపెట్టవూ..”,

“మా ఇల్లు ఈ ఎదురుదే అమ్మా రండి నీళ్ళు తాగుదుర్గాని” అని, ఆవిడ్ని పట్టుకుని తీసుకెళ్ళాను. కూర్చోమని కుర్చీ చూపించి ఫ్యాను వేసి మంచినీళ్ళు తెచ్చిచ్చాను.
ఆబగా ఆ మంచినీళ్ళు తాగి, “మంచిది బాబూ నేనిక వెళ్తాను” అని లేచిందామె.

“ఉండండీ, ఎక్కడికీ నేను తోడురానా?”,

“అక్కర్లేదు బాబూ నేను బానే ఉన్నాను” అని ఏదొ అనుకుంటూ ఆ పోస్టాఫీసు అరుగు వైపు దారితీసింది. సాయంత్రం వరకూ ఆమె గురిచి ఆలోచిస్తూ మధ్య మధ్యలో ఆ అరుగు వైపు చూస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు.

ఆ రాత్రి నాకు నిద్ర సరిగ్గా పట్టలేదు, ఆవిడ గురించి తెలుసుకోవాలనే ఆలోచన నాలో పెరిగింది. ఆ రోజు సాయంత్రం పోస్టాఫీసు మూశాక, ఆమెకి తెలియకుండా ఆవిడ వెనకాలే వెళ్ళాను. ఓ కిలోమీటరు అవతల వాళ్ళుండేది, చిన్న ఇల్లు, చుట్టూ మొక్కలతో చూడటానికి ముచ్చటగా ఉంది. ఎవరైనా కనబడతారేమో అని చూశాను. అంతలో ఆ ఇంట్లో నుండి వాళ్ళ పనిమనిషనుకుంటా బయటికి వచ్చింది, వెంటనే ఆ అమ్మాయితో మాటకలిపి అడిగాను

“ఎమమ్మా ఈ ఇంట్లో ఉండే ఆవిడ రోజూ ఎందుకలా పోస్టాఫీసు దగ్గరకొచ్చి కూర్చుంటారు” అని.

దానికా పనిమనిషి, “ఏం చెప్పమంటారు బాబూ, ఒకప్పుడు మహరాణిలా ఉండెది ఆ అమ్మ, అయ్యగారిది పెద్ద వ్యాపారం, వాళ్ళకి ఓ కొడుకు అమెరికాలో ఉద్యోగం. ఈ చుట్టుపక్కలందరికీ తలలో నాలికలా ఉండేవారు అమ్మగారు.అయ్యగారు ఓ నాలుగు నెలల క్రితం యాక్సిడెంటులో చనిపోయారు. అప్పట్నుండి ఇదిగో ఇలా అయిపోయారు అమ్మగారు. అయ్యగారు చనిపోయినా అబ్బాయిగారు రాలేదు, ఆస్తిని బంధువులమంటూ వచ్చి ఎవరికి దొరికింది వారు పట్టుకెళ్ళిపోయారు, ఒకప్పుడు పంచభక్షపరమణ్ణాలు తినేవారు పాపం ఇప్పుడు సరిగ్గా తిండి తిని నెల రోజులయ్యింది, రోజూ పోస్టాఫీసుకెళ్ళి వాళ్ళబ్బాయి ఎమైనా ఉత్తరం వ్రాశాడేమో అని ఆ పిచ్చి తల్లి ఎదురుచూస్తూ ఉంటుంది” అని చెప్పి వెళ్ళిపోయింది. గుండెల్ని ఎవరో పిండిన ఒక ఫీలింగ్ ఆ కొడుకు మీద పట్టరాని కోపమొచ్చింది, చాలా బెంగగా అనిపించింది రూముకెళ్ళాక అమ్మకి ఫోను చేసి మాట్లాడాక కాస్త ఊరట దొరికింది.

నాకు రెండు ఇంటర్వ్యూలకి కాల్స్ వస్తే ఆ మరుసటి వారమంతా కాస్త బిజీగా ఉండి, ఆవిడకోసం చూడలేదు, తర్వాత ఓ రెండు రోజులు ఆవిడ కనపడలేదు, ఏమైందో అని ఆమె ఇంటికి వెళ్ళాను. గెటు దగ్గర నిలబడి కాలింగు బెల్లు నొక్కాను. లోపలినుండి ఒకతనొచ్చి గేటు తీసి “ఎవరండి? ”అడిగాడు. “నా పేరు శెఖరం అండి, నేను పోస్టాఫీసు వీధిలో ఉంటాను, గత కొన్ని రోజులనుండి ఈ ఇంట్లో ఉండే అమ్మ అక్కడికి రావటంలేదు విషయమేంటో కనుక్కుందామని ఇలా వచ్చాను” చెప్పాను. “ఆవిడకి ఒంట్లో బాగోవటం లేదు సార్, నేను వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని, రండి లోపలికి”. లోపలికెళ్ళాను, ఇళ్ళు బయటకి చిన్నదిగా సాధారణంగా కనపడినా, ఆ పనిమనిషన్నట్టు ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం అని తెలుస్తుంది, ఆ ఇంట్ళోని వస్తువులని బట్టి.

“మీరు ఈవిడని ఎలా ఎరుగుదురు?” అడిగారు డాక్టరుగారు.

రోజూ పోస్టాఫీసు దగ్గర చూసేవాడిననీ, ఒక రోజు మా రూముకి కూడా ఆవిడని తీసుకెళ్ళానని చెప్పాను, “అసలేమయిందండి? ఈవిడకి ఏంటి ప్రాబ్లం?” అడిగాను.

“ఏమీ లేదు సార్ మనోవ్యాధి అంతే, దానితోనే కృంగిపోతున్నారు, మీరేమి అనుకోనంటె ఒక చిన్న సహాయం చేయగలరా?” అడిగారు.

“ఆ చెప్పండి”,

“ఈ ఇంటి పనమ్మాయి కోసం చూస్తున్నాండీ, ఆమె వస్తే వెళ్దామని కానీ ఆమె ఇంకా రాలేదు, ఇహనొ ఇప్పుడో వస్తుంది, కానీ నాకొక అర్జెంటు విషయమై హాస్పిటలుకి వెళ్ళాలి ఎలాగా అని చూస్తున్నాను, ఇఫ్ యూ డొంట్ మైండ్ కొంచం పనమ్మాయి వచ్చే వరకు ఈమెకి తోడుంటారా?”

“అయ్యో పర్వాలేదండీ నేనుంటాను మీరెళ్ళండి”

రండి ఆవిడని చూద్దురుగాని, అంటూ లోపలి గదిలోకి దారితీశారు డాక్టరుగారు, ఆ గదినిండా ఫోటోలే, ప్రతి గోడకి నాలుగు, ఆవిడ మంచం పక్కన రెండు, అన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలని నాకర్ధమైంది. డాక్టరుగారు, “ఏవండీ పార్వతిగారూ, ఇదిగోండి మిమ్మల్ని కలవటానికి శేఖరం అట వచ్చారు చూడండి” అన్నారు.

నేను దగ్గరికి వెళ్ళి, “ఎలా ఉన్నారమ్మా? గుర్తు పట్టారా నన్ను” అని అడిగాను.

ఆవిడ నన్ను చూసి పలకరింపుగా నవ్వారు.

“శేఖరం గారు ఇది నా విజిటింగు కార్డు ఏమైన ఇబ్బందైతే ఫోను చెయ్యండి, థాంక్సెలాట్” అని నాకు కార్డిచ్చి, పార్వతి గారితో ‘వెళ్ళొస్తాను, మీకు ఈ అబ్బాయి తోడుంటానన్నాడు’ అని చెప్పి వెళ్ళిపోయారు.

“బాబూ నువ్వు పోస్టాఫీసు దగ్గర ఉంటావు కదూ, ప్చ్, నాకు ఒంట్లో బాగోలేదు నువ్వు కొంచం రేపు వీలుచేసుకుని పోస్టాఫీసుకెళ్ళి నాకేమైనా ఉత్తరం వచ్చిందేమో అడిగిపెట్టవూ” అని అన్నారు.

“సరేనమ్మా నేను కనుక్కుంటానుగానీ ఏమిటమ్మా మీరిలా ఆరోగ్యం పాడుచేసుకోవటం, రోజూ అలా పోస్టాఫీసుదాకా నడవకపోతే, ఆ ఉత్తరమేదో వస్తే పోస్టుమానే తెచ్చి ఇస్తాడు కదా” అన్నాను నేను. దానికామె నవ్వి, “ ఏమారోగ్యాం బాబు, జీవితంలో ఎన్నో ఓడిదుడుకులను ఎదుర్కున్నాను, ఈ చిన్నపాటి నలత నన్నేమీ చేయదు” అంటూ తన స్వగతాన్ని చెప్పటం మొదలుపెట్టింది.

“నేనొక అనాధని బాబు, చిన్నతనంలో ఎవరో పుణ్యాత్ముడు వీధిలో ఆకలితో ఏడుస్తూ కూర్చున్న నన్ను చేరదీసి అణ్ణం పెట్టి ఓ అనాధాశ్రమంలో చేర్చాడు. అక్కడే నేను పెరిగి పెద్దదానినయ్యాను, ఆ అనధాశ్రమంలో ఎందరో పిల్లల్ని ఎవరో ఒకరు వచ్చి దత్తత తీసుకెళ్తూండెవారు, వారందర్నీ చూసి నాకూ అమ్మానాన్నలు ఎవరైనా ఉంటే బాగుండు అని వెక్కివెక్కి మౌనంగా ఏడ్చిన రాత్రులెన్నో…. మా ఆశ్రమంలోనే చదువుకుని పదవ తరగతి పాసయ్యాక, టైపింగు నేర్చుకుని ఓ ఆఫీసులో టైపిష్టుగా చేరి, మొదటినెల జీతం అందే వరకు నాకున్నది రెండే రెండు చీరలు, ఒకటి వంటిమీదుంటే, మరోటి దండెం మీదుండేది. ఆ తర్వాత అదే కంపెనీలో ఉద్యోగంచేస్తున్న హరిప్రసద్ గారూ నేనూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. అప్పటిదాకా ఏ బంధువులూ లేని నాకు ఆయనే ఆత్మబంధువయ్యి నన్ను మహారాణిలా చూసుకున్నారు, పెళ్ళైన నాలుగేళ్ళవరకూ పిల్లలు కలగలేదు ఏంతో బాధపడేవాళ్ళం, మా అత్తగారు, ఆయన తరుపు బంధువులూ అడిగే ఈటలవంటి ప్రశ్నలకి మావారు నన్ను సమర్ధించుకుంటూ, అందరికీ తానే సమాధానమిస్తూ నన్ను అపురూపంగా చూసుకునేవారు, పోనీ ఎవరినైనా దత్తత తీసుకుందామంటే మా అత్తగారు ససేమిరా అనేవారు. ఇన్ని బాధల తరువాత నాకు పుట్టినవాడే మా అబ్బాయి సూర్యం” అని చెప్తూండగా పొలమారి దగ్గు వచ్చింది… పక్కనే ఉన్న నీళ్ళగ్లాసునందించాను. ఈలోగా వాళ్ళ పనమ్మాయి వచ్చింది, నన్ను చూసి ‘ఎంతసేపయ్యింది బాబు వచ్చి’ అని పలకరించింది. “బాబుకి కాఫీ పట్రా” అని పార్వతిగారు చెప్తే నన్నుండమని ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది.

“మీ సూర్యం అమెరికాలో ఉన్నాడట కదండీ” అడిగాను నేను, “అవును బాబు, వారు అందరికీ అన్నీ సమయానుకూలంగా చేశేసేవారు, ఏనాడు ఇది తక్కువైంది అని అనుకోకుండా సర్దేవారు, రెండు సంవత్సారల క్రితమే వారి చేతుల మీదగానే సూర్యం పెళ్ళి కూడా చేశారు, వాడు ఉద్యోగనిమిత్తం, విదేశాలు వెళ్ళాడు వెళ్ళిన మొదటి సంవత్సరం నాకు బాగా బెంగ వేసింది అది చూసి మా వారు నన్ను అమెరికాకి తీసుకెళ్ళి వాడ్ని చూపించారు, దానికి నేను ‘సారీ అండీ నాకోసం ఇప్పుడు అనవసరమైన ఖర్చు మీకు’ అని అంటే అప్పుడాయన నవ్వి ‘పిచ్చి మొద్దూ సారీ ఎందుకురా, ఈ డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు నాకు బాధలేదు డబ్బు ఖర్చైనా పర్వాలేదు నీ మొహంలో నవ్వు చూశాను కదా అది చాల్రా నాకు’ అని అన్న మాటలు విన్నప్పుడు నా మీద నాకు కించిత్తు గర్వం కలిగింది, నా నవ్వు మీద నాకు అసూయ కలిగింది…నేను పెళ్ళినాడు చేసిన ‘భోజ్యేషు మాతా…శయనేషు రంభ, కరణేషు మంత్రి క్షమయా ధరిత్రి, ’ అనే పదాలకి నేనెంత సరిపోయానో తెలియదు కానీ, “ధర్మేచ, అర్థేచా, కామేచా నాతిచరామి” అన్న మాటలని తాను సరిగ్గా పాటించారు ఒక్క ‘మోక్షేచ నాతిచరామి’ మాత్రం నన్ను విడిచి తాను ముందుగా వెళ్ళిపోయారు” అంటూ కన్నీళ్ళపర్యంతమయ్యారు పార్వతిగారు

“అయ్యయ్యో ఊరుకోండమ్మా, మీరిలా బాధపడితే ఎలా ఊరుకోండి”

“ఇంకా బాధపడటానికేముందిలే బాబు, పాపం మనవడిని చూడాలి అని ఎంతాగనో అనుకునేవారు ఆయన, కానీ, సూర్యానికేమి పని పడిందో ఇంతవరకు అసలు రాలేదు, వారు పోయినప్పుడు మాత్రం ‘మై డీప్ కండోలెన్సెస్ విల్ రీచ్ సూన్’ అని టెలిగ్రాము పంపాడు అయినా నేనెదురుచూసేది వాడొచ్చి నన్ను చూసుకోవాలని కాదు బాబు, పాపం వాడి నాన్న పోయిన దుఃఖం వాడిని పిండేస్తుండి ఉంటుంది, ఒక అమ్మగా వాడిని అక్కున చేర్చి ఓదార్చాలనే నా తపన, కొడుకు చేత వారికి తలకొరివి పెట్టించలేకపోయినా మనవడిని ఎత్తుకుని ముద్దాడి వాడి తాత ఆత్మ కి శాంతి చేకూర్చాలని ఆశ”…అది విన్న నా గుండె చివుక్కుమంది, కన్నతండ్రి చనిపోతే చాలా ఫార్మల్గా ఏదో మొహమాటానికి పంపినట్టు ఓ టెలిగ్రాము పంపిస్తాడా, ఛి అసలు వాడు కొడుకేనా, పాపం ఈ పిచ్చితల్లి వాడికోసం వాడు వ్రాసే ఉత్తరం కోసమింకా ఎదురుచూస్తుంది, కనీసం అదన్నా గుర్తుందో లేదో ఆ సూర్యానికి, ఆవిడ గుండెలో నీళ్ళు, కళ్ళలో ఎదురుచూపుని చూస్తుంటే నాకు జాలి కంటే కోపమెక్కువేస్తోంది, అసలు ఆ సూర్యమనే వాడెక్కడున్నాడో వెతికి పట్టుకుని నాలుగు తన్ని ఈడ్చుకొచ్చి ఈ తల్లి పాదాలమీద పడేయాలన్నంత ఆవేశంగా ఉంది.“సూర్యానిదేదైనా ఫోనునంబరుందా అమ్మా?” అడిగాను, “నా దగ్గర లేదు బాబు, నాకు ఆ అమెరికాకి ఫోను చెయ్యటం రాదు, ఎప్పుడైనా మాట్లాడాలంటే వాళ్ళ నాన్నగారే ఫోను చేసిచ్చేవారు” అని అన్నారు. “పొద్దుపోయింది నేను ఇంటికి వెళ్ళొస్తానమ్మా, మీరు జాగ్రత్త, మళ్ళీ రేపు కలుస్తాను” అని చెప్పి నేనింటికి వచ్చాను.

ఇంటికి వెళ్ళాక నాకేమీ తోచలేదు ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా ఆ అమ్మ ఆక్రోశం తీర్చాలని బాధ, కసి. ఇంతలో డాక్టరు గారిచ్చిన విజిటింగు కార్డు కనపడింది, వెంటనే ఆయనకి ఫోను చేశాను, “డాక్టరు గారూ సారీ అండి ఈ టైములో ఫోను చేసినందుకు, నేను శేఖరాన్ని, ఇందాక పార్వతమ్మగారింట్లో కలిశాము, ఏమీ లేదండీ, పార్వతమ్మగారబ్బాయి సూర్యంది ఏదైనా ఫోను నంబరుంటే ఇస్తారనీ”…….

‘కౌసల్యా సుప్రజా రామా…’ దూరంగా గుడిలో సుప్రభాతం లీలగా వినిపిస్తోంది. తెల్లవారింది, లేచి స్నానం చేసి, టిఫినయ్యాక, పది గంటలకి పార్వతమ్మగారింటికి బయల్దేరాను, దారిలో ఓ డజను అరటిపళ్ళు కొనుక్కుని. వాళ్ళింటి దగ్గరకెళ్ళగానే, వాళ్ళ గేటు ముందు కోలాహలంగా ఉండటం కనిపించింది. ఏమయ్యుంటుందా అని కాస్త వడివడిగా అక్కడికి చేరుకున్న నాకు ఎదురుగా పార్వత్మ్మగారి శవం స్వాగతం పలికింది. నిశ్చేష్టుడినయ్యాను ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి, ‘అమ్మా’ అనే ఝుంకారంతో గుండె లోపల ఏదో తుఫాను. ఆమె శరీరంలోని ప్రతి అణువూ స్పందనలేకుండా అలా స్తంభించిపోయింది. ఆవిడ మరణించింది, బాల్యంలోని ఆశలలో, యవ్వనంలోని స్వప్నాలలో, ముదిమిలోని నిరాశలలో నడిచిన ఆ పాదాలు నిర్జీవమై పోయాయి. ఆమె ఒకసారి నాతో అన్నారు, “యవ్వనంలో ఎన్నో కలల్ని కంటాం, అల్లుతాం, వృధా చేస్తాం కాని ఈ ముసలితనం మీదపడ్డాకే అర్ధమవుతుంది అవన్నీ కల్లలేనని” అని, నిజమే ఆవిడ జీవితంలో ఓ పరిపూర్నమైన కుటుంబం అనేది ఓ కలగానే కల్లగానే మిగిలిపోయిందాఖరికి. ప్రేమకోసం తపించిన ఆ గుండె ఇక ఈ భారాన్ని మోస్తూ కదలలేనంటు ఆగిపోయింది, నీకు నీడైన నీ భర్తని చూపించలేని ఈ నిశీధిలో ఇక ప్రేమనేమి వెతికిపెట్టగలనని నీ మనసుకెలా చెప్పాలో తెలియక ఆ పెదవులు మూగబోయాయి. ఎప్పట్నుండో విశ్రాంతి లేకుండా ఎదురు చూస్తున్న ఆ కళ్ళని ఇకనైనా విశ్రమించమని వాటిని రెప్పలు శాశ్వతంగా కౌగిలించుకున్నాయి, ఎన్ని నాళ్ళనుండి లేదో నిద్ర, అన్ని నాళ్ళకి ఇకపై రోజులన్నీ జమా అనుకుందేమో ఆమె శాశ్వతంగా నిద్రపోతోంది.

నెల రోజుల క్రితం వరకు ఆవిడెవరో నాకు తెలియదు, రెండు వారాల క్రితం వరకు ఆమెతో మాట్లాడనైనా లేదు, నిన్నటి వరకు ఆవిడ గతం తెలియదు, ఐనా ఏదొ బాధ, గుండెలని పిప్పి చేస్తున్న భయంకరమైన నొప్పి, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, రాత్రి డాక్టరు గారు చెప్పిన విషయం విని వేసిన బాధకి ఈ బాధ జతై నన్ను తట్టుకోలేనంత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది, వాళ్ళ నాన్నగారి మరణ వార్త విని బయలుదేరిన సూర్యం, అతని భార్య, బాబు దారి మధ్యలో విమానం కూలి చనిపోయారు. నేనెంత పొరబడ్డానో గుర్తు తెచ్చుకుని బాధపడ్డాను ఆ దేవుడెంత కఠినాత్ముడో అనిపించింది అది తెలిసి, కానీ ఇవాళ అనిపిస్తుంది ఆ తప్పు చేసిన దేవుడే ఈ తల్లికి నిజం తెలియనీయకుండా చేసి ఓ ఉపకారం చేశాడు. అదే ఈ తల్లికి తెలిసుంటే? చిన్నతనంలో తన గుండెలపై నాట్యాలాడిన ఆ కాళ్ళు ఇక తనవైపు రాలేవని తెలిసుంటే? తలుచుకుంటేనే భయమేస్తుంది . ఎదురుగా ఆవిడని చూస్తుంటే గుండెలవిసేలా తనివితీరా ఏడవాలనిపిస్తోంది. అమ్మని చూడాలనిపిస్తోంది తనని నేనెంత ప్రేమిస్తున్నానో చెప్పాలని ఉంది, ఆ ప్రేమ మూర్తిని చూస్తేనే అర్ధమయింది తల్లి ప్రేమ ఎంత గుడ్డిదో, ఎంత పిచ్చిదో. ఆ రోజు రాత్రికే బస్సు ఎక్కాను మా ఊరికి.


3 comments:

ravee said...

A heart touching narration. I feel a small pain in my heart while reading the last episode.

కార్తీక్ said...

good superga raasaaru.

www.tholiadugu.blogspot.com

Sandeep P said...

మా ఇంటి పక్కన రామశాస్త్రిగారు అని ఒకాయన ఉండేవారు. ఆయన తల్లి కంటే ముందు చనిపోయారు. చివరిదాకా ఆమెకు ఆయన బ్రతికే ఉన్నాడని అబద్ధం చెప్పారు. విధి ఎవరితో ఎలాగ ఆడుకుంటుందో చెప్పలేము.